వేసవి విద్యుత్ డిమాండ్‌కు ముందస్తు కసరత్తు!
జనవరి నుంచే పెరగనున్న వినియోగం
మౌలిక వసతుల బలోపేతానికి చర్యలు
అధికారులకు టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశం
కాకతీయ, హన్మకొండ : వేసవిలో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో జనవరి నుంచే విద్యుత్ వినియోగం పెరిగే అవకాశముందని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. బుధవారం హన్మకొండ నక్కలగుట్టలోని సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి 18 సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వేసవి సన్నద్ధతపై సమీక్షించారు. ఇటీవల పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అదనంగా సుమారు 800 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణాలను వేగవంతం చేసి జనవరిలోపు అందుబాటులోకి తేవాలని, 33 కేవీ ఇంటర్‌లింకింగ్ పనులు, ఓవర్‌లోడ్ ఉన్న 33 కేవీ, 11 కేవీ ఫీడర్ల పనులను డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అధిక లోడ్ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచడంతోపాటు విద్యుత్ లైన్లలో కెపాసిటర్ బ్యాంకులు, సెల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో డైరెక్టర్లు వి. మోహన్‌రావు, టి. మధుసూదన్, చీఫ్ ఇంజినీర్లు కె. తిరుమల్‌రావు, సురేందర్, అశోక్, అన్నపూర్ణ, జనరల్ మేనేజర్లు తిరుపతి, ప్రభావతి, వాసుదేవ్, బాబూరావు, డివిజనల్ ఇంజినీర్లు అనిల్‌కుమార్, నాగరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

