సోనియాను విమర్శించే ముందు చరిత్ర తెలుసుకోండి!
రాష్ట్ర ఏర్పాటులో సోనియా నిర్ణయాన్ని విస్మరించడం కృతజ్ఞతా..?!
నాగార్జునసాగర్‌కు శంకుస్థాపన చేసిన నెహ్రూ కృషిని తక్కువ చేస్తారా?
పదేళ్లలో కృష్ణా బేసిన్‌కు బీఆర్‌ఎస్ చేసిందేమిటి?
తెలంగాణకు 555 టీఎంసీల నీటి కోసం ట్రైబ్యునల్‌లో వాదిస్తున్నాం
సాగర్ నుంచి 1.8 టీఎంసీల తరలింపుపై ఇప్పటికే అభ్యంతరాలు
బీఆర్‌ఎస్ వైఖరిపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ధ్వజం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని విస్మరించి ఆమెపై విమర్శలు చేయడం కృతఘ్నత అని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. సోనియా గాంధీ సంకల్పం లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే కాదని, ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం శాసనసభలో చెప్పారని గుర్తుచేశారు. సోనియా ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఉందా లేదా అన్నదానికంటే, రాష్ట్ర ఏర్పాటుకు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యమని స్పష్టం చేశారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే కేటీఆర్ కుటుంబానికి రాష్ట్రంలో పదవులు వచ్చాయని ఉత్తమ్ కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ విషయాన్ని మరిచి తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన సోనియా గాంధీపై విమర్శలు చేయడం బీఆర్‌ఎస్ నాయకుల వైఖరిని తెలియజేస్తోందన్నారు. రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని విస్మరించడం సరికాదని పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు గొప్పతనం తెలియదా?
మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి తప్పుబట్టారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నెహ్రూ కృషిని తక్కువ చేసి మాట్లాడటం విడ్డూరమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి సుమారు 21 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న నాగార్జునసాగర్ అద్భుతమైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. లక్షలాది ఎకరాలకు నీరందిస్తున్న ప్రాజెక్టుపై మాట్లాడే ముందు పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టుల వివరాలు చెప్పాలని సవాల్ విసిరారు. సాగునీటి రంగంలో రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు అందించిన ఫలితాలేమిటని ఉత్తమ్ ప్రశ్నించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్ ఆధునికీకరణ, ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టుల పురోగతిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ సాగునీటి వ్యయంలో దాదాపు 75 శాతం గోదావరి బేసిన్‌కు, కేవలం 25 శాతం మాత్రమే కృష్ణా బేసిన్‌కు కేటాయించారని ఆరోపించారు. దీంతో మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల రైతులకు అన్యాయం జరిగిందన్నారు.
కృష్ణా జలాల వాటాపై గత ప్రభుత్వ వైఖరేంటి?
811 టీఎంసీల కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించే నిష్పత్తికి గత ప్రభుత్వం అంగీకరించిందని మంత్రి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం మాత్రం పరీవాహక ప్రాంతం, సాగునీటి అవసరాలు, జనాభా తదితర అంశాల ఆధారంగా తెలంగాణకు 555 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ ముందు వాదిస్తోందని తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ 4,464 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకోగా, తెలంగాణ వినియోగం 1,993 టీఎంసీలకే పరిమితమైందని చెప్పారు. ప్రస్తుత జల సంవత్సరంలో అక్టోబరు 30 నాటికి ఆంధ్రప్రదేశ్ 98.16 టీఎంసీలు, తెలంగాణ 122.74 టీఎంసీల నీటిని వినియోగించుకున్నాయని వివరించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2014లో ప్రకటించినప్పటికీ, సమగ్ర ప్రాజెక్టు నివేదికను 2022లోనే సమర్పించారని ఉత్తమ్ విమర్శించారు. అనుమతుల సాధనలో జరిగిన జాప్యం కారణంగా ప్రాజెక్టు వ్యయం పెరిగిందని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేసిన ఖర్చులపై సమగ్ర వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
సాగర్ నీటి తరలింపుపై అభ్యంతరాలు తెలిపాం
నాగార్జునసాగర్ జలాశయం నుంచి సుమారు 1.8 టీఎంసీల నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన తాగునీటి పథకంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలు తెలిపిందని మంత్రి వెల్లడించారు. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరాలను పంపినట్లు చెప్పారు. తెలంగాణ నీటి హక్కులను ప్రభావితం చేసే ఏ పథకాన్నైనా వ్యతిరేకిస్తామని, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

