స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు
సెయింట్ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం
బస్సు ఫీజులు వసూలు చేసి రవాణా సౌకర్యం కల్పించలేదని ఆరోపణ
వేడుకలకు విద్యార్థులను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్న
యాజమాన్యం వివరణ ఇవ్వాలని డిమాండ్
ప్రిన్సిపాల్ స్పందించకపోవడంపై చర్చ
కాకతీయ, ఆత్మకూరు : దేశవ్యాప్తంగా 80వ స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుండగా.. ఆత్మకూరు మండల కేంద్రంలోని సెయింట్ థెరిస్సా పాఠశాల విద్యార్థుల్లో పలువురు వేడుకలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాల బస్సులు గ్రామాలకు వెళ్లకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు రాలేకపోయారని పేర్కొన్నారు. బస్సు ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు జాతీయ పండుగ రోజున రవాణా సౌకర్యం ఎందుకు కల్పించలేదని ప్రశ్నిస్తున్నారు. స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు జాతీయ స్ఫూర్తి, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా.. వారిని వేడుకలకు దూరంగా ఉంచడం సరికాదని తల్లిదండ్రులు అంటున్నారు. బస్సులు నడపకపోవడానికి కారణాలను యాజమాన్యం స్పష్టం చేయాలని కోరుతున్నారు.

ఫీజులు వసూలు చేశారు… బస్సులు ఎందుకోసం..!
విద్యార్థుల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన పాఠశాల బస్సులు గ్రామాలకు వెళ్లకపోవడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బస్సు ఫీజులు తీసుకుంటున్నప్పుడు రవాణా సౌకర్యం కూడా సక్రమంగా అందించాలని కోరుతున్నారు. బస్సులు నడపకపోవడం వల్ల ఇంధన ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశమా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను స్వాంతంత్య్ర వేడుకలకు ఎందుకు దూరంగా ఉంచారు, గ్రామాలకు బస్సులు ఎందుకు వెళ్లలేదు అనే అంశాలపై పాఠశాల యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై వివరణ కోరేందుకు ప్రిన్సిపాల్‌ను సంప్రదించగా స్పందించలేదని తెలిపారు. ఫీజుల వసూళ్లతో పాటు విద్యార్థుల రవాణా, జాతీయ పండుగల్లో వారి భాగస్వామ్యంపై కూడా పాఠశాల యాజమాన్యం శ్రద్ధ చూపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


