కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి
భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలి
నర్సంపేట–వరంగల్‌కు ఉదయం, సాయంత్రం బస్సు నడపాలి
సేవాలాల్ గోర్ బంజారా ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బానోతు రాఘవేంద్ర డిమాండ్
కాకతీయ, గీసుగొండ: కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆర్చి వద్ద ఆర్టీసీ బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలని సేవాలాల్ గోర్ బంజారా ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సూర్య తండ సర్పంచ్ బానోతు రాఘవేంద్ర కోరారు. ఈ మేరకు నర్సంపేట టీజీఎస్‌ఆర్టీసీ డిపో మేనేజర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై నడిచే ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులను ఆర్చి వద్ద నిలిపితే భక్తులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. సూర్య తండ, కొమ్మాల పరిసర గ్రామాల ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నర్సంపేట నుంచి సూర్య తండ, కొమ్మాల దేవస్థానం, కొమ్మాల గ్రామపంచాయతీ మీదుగా వరంగల్‌కు, తిరుగు ప్రయాణంలో అదే మార్గంలో నర్సంపేటకు ఉదయం, సాయంత్రం బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని మరో వినతిపత్రం అందజేశారు. రెండు వినతులపై సానుకూలంగా స్పందించి త్వరగా రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు.

