చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు
కాంగ్రెస్ పెద్దవంగర మండల అధ్యక్షుడు రంగు మురళి గౌడ్
కాకతీయ, పెద్దవంగర : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం తిరుగుబాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రంగు మురళి గౌడ్ అన్నారు. గురువారం పెద్దవంగర మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని నిర్వహించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ దొరల దౌర్జన్యాలు, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారని రంగు మురళి గౌడ్ కొనియాడారు. ఆమె ధైర్యం, తెగువ, ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు ముద్దసాని సురేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు సంకపల్లి రవీందర్ రెడ్డి, సిరి శ్రీనివాస్, కొండ్రతి శ్రీనాథ్, కొమరమల్లు, వెంకటేష్, లింగమూర్తి, రాములు తదితరులు పాల్గొన్నారు.

