మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ ఆపాలి
సీఎంఆర్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
మిల్లర్‌ను నష్టాల్లోకి నెట్టి రైతుకు న్యాయం చేయలేరు
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్
కాకతీయ, ములుగు ప్రతినిధి : మిల్లర్‌ను నష్టాల్లోకి నెట్టి రైతుకు న్యాయం చేయలేరని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో మిల్లర్లను వేధించడం ఆపాలని, మిల్లింగ్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మిల్లర్లు నల్లబ్యాడ్జీలు ధరించి పాల్గొనగా, అంతకుముందు జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ధర్నా చౌక్‌లో ప్రవీణ్ మాట్లాడుతూ గత యాసంగి, వానాకాలం సీజన్లలో లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసి బియ్యం అందించామని, అయినా బకాయిలు, మిల్లింగ్ చార్జీలు పూర్తిగా విడుదల కాలేదన్నారు. పెరిగిన విద్యుత్, కూలీలు, హమాలీ, రవాణా ఖర్చులకు ప్రస్తుత మిల్లింగ్ చార్జీలు సరిపోవడం లేదన్నారు. 15–20 శాతం తరుగుదల, రికవరీపై క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ నిర్ణయం తీసుకోవాలని కోరారు. నాన్–ఎఫ్‌ఏక్యూ ధాన్యంతో క్వింటాల్‌కు రూ.750–1,000 వరకు అదనపు నష్టం వస్తోందన్నారు. సీఎంఆర్ బియ్యం సిద్ధంగా ఉంచినా సకాలంలో స్వీకరించకపోవడంతో నిల్వ, కూలీలు, విద్యుత్, వడ్డీ భారం పెరుగుతోందన్నారు. 2025–26 సీజన్ సీఎంఆర్ వివరాలను ప్రభుత్వం మిల్లువారీగా పారదర్శకంగా వెల్లడించాలని, డిమాండ్లు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సహోదరరెడ్డి, ఎలగందుల మోహన్, కొమురవెల్లి హరినాథ్, పల్లెపాటి సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

