ఏధిర పీహెచ్సీలో ఐటీడీఏ పీవో తనిఖీ
వైద్య సేవలు, సిబ్బంది హాజరుపై పరిశీలన
కాకతీయ, ఏటూరునాగారం : నూగూరు వెంకటపురం మండలం ఏధిర గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టొప్పో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, వ్యాక్సిన్ల భద్రత, రోగులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి, వైద్య సేవల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేసి మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాలను తెలుసుకున్నారు. సిబ్బంది క్రమం తప్పకుండా విధులకు హాజరయ్యేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఫ్రీజర్లోని వ్యాక్సిన్లు, ఇంజెక్షన్ల నిల్వకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని సూచించారు. మందుల నిల్వ, తయారీ, గడువు తేదీలను పరిశీలించి, స్టాక్ స్వీకరణ, పంపిణీ వివరాలకు రిజిస్టర్ నిర్వహించాలని, సీజనల్ మందులు, పాముకాటు, కుక్కకాటు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇన్పేషెంట్ వార్డులు, మరుగుదొడ్ల సౌకర్యాలను పరిశీలించి, నమోదవుతున్న వ్యాధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నివాస ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. రోగులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితులు, పింఛన్లు, నిత్యావసర వస్తువుల సరఫరాపై ఆరా తీశారు. రాత్రివేళ సిబ్బంది, వసతి సౌకర్యాలపై వివరాలు తెలుసుకుని, అవసరాలుంటే ఐటీడీఏ డిప్యూటీ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారితో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అత్యవసర రోగుల తరలింపునకు అలుబాక కేంద్రంగా 108 అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయని వైద్యాధికారి తెలిపారు.

