నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్య
పురుగుమందు సేవించిన స్వర్ణలత
చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూత
అదనపు కట్నం, భూమి కోసం వేధింపుల ఆరోపణలు
భర్త, అత్తమామలపై కేసు నమోదు
కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రోయ్యూరు గ్రామానికి చెందిన 4 నెలల గర్భిణి దుర్గం స్వర్ణలత (25) మృతి చెందారు. అదనపు కట్నం, భూమి కోసం భర్త హరీష్ (28), అత్త వజ్రమ్మ, మామ లింగయ్య తన కుమార్తెను శారీరకంగా, మానసికంగా వేధించారని తండ్రి దుర్గం లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏటూరునాగారం పోలీసులు క్రైం నంబర్ 169/2026, బీఎన్‌ఎస్ సెక్షన్ 80 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. స్వర్ణలతకు హరీష్‌తో 2025 మే 29న ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. శుక్రవారం ఉదయం స్వర్ణలత అస్వస్థతకు గురికావడంతో ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఉదయం సుమారు 10 గంటలకు వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. స్వర్ణలత మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ, గతంలో కట్నం, డబ్బులు, భూమి కోసం ఒత్తిడి, వేధింపులు జరిగినట్లు తెలిపారు. ఘటనకు ముందు జరిగిన పరిణామాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. సాక్ష్యాధారాల ఆధారంగా చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

