టీచర్ అంజుమ్ సుల్తానాకు ప్రతిభా పురస్కారం
గాంధీ జయంతి వేడుకల్లో ఘనంగా సన్మానం
కాకతీయ, నెల్లికుదురు: విద్యారంగంలో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని టీజీఎంఎస్ సోషల్ టీచర్ ఎం.ఏ. అంజుమ్ సుల్తానాకు ప్రతిభా పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో శుక్రవారం ఆమెను ఘనంగా సన్మానించి పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, సామాజిక అవగాహన, నాణ్యమైన బోధనకు తాను చేస్తున్న కృషికి ఈ పురస్కారం గుర్తింపుగా భావిస్తున్నట్లు అంజుమ్ సుల్తానా తెలిపారు. పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఉపేందర్‌రావుతో పాటు ఉపాధ్యాయ బృందం అంజుమ్ సుల్తానాను అభినందించారు.

