గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్!
కాకతీయ, నెల్లికుదురు : గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. నెల్లికుదురు పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో గతంలో పోలీసుల తనిఖీల సమయంలో తప్పించుకొని పరారీలో ఉన్న నిందితుడు కాపుగేరీ రాజును అరెస్టు చేసినట్లు తెలిపారు. మంగళవారం కేసముద్రం సర్కిల్ కార్యాలయంలో ఎస్సై గంగారపు కరుణాకర్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా హనుమాన్పురం పట్టణానికి చెందిన రాజును అదుపులోకి తీసుకొని విచారించగా, సహచరులతో కలిసి భద్రాచలం ప్రాంతంలో సుమారు 2.4 కిలోల ఎండు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అధిక ధరకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడైందన్నారు. నిందితుడి నుంచి పంచుల సమక్షంలో ఆపిల్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి సహకరించాలని సీఐ కోరారు. కార్యక్రమంలో ఎస్సై గంగారపు కరుణాకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

