పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి
న్యాయవాదులు, అధ్యాపకులు, యువత ఎన్నికల్లో భాగస్వాములు కావాలి
సర్వోత్తమ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
కేయూ అభివృద్ధికి ప్రభుత్వంతో సమన్వయం : డీసీసీ అధ్యక్షుడు ఇనగాల
విద్యావంతులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్‌రెడ్డి
కాకతీయ, హనుమకొండ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. విద్యావంతులు, న్యాయవాదులు, అధ్యాపకులు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని కోరారు. ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా హనుమకొండ జిల్లా కోర్టు సముదాయంలో, కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అవగాహన, ఆత్మీయ సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జిల్లా కోర్టు సముదాయంలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు హెల్ప్‌డెస్క్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కె.ఆర్. నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సందర్శించారు. అనంతరం బార్ అసోసియేషన్లు, మహిళా బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశమై నవంబర్ 6లోగా అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. న్యాయవాదులు తమ దృష్టికి తీసుకొచ్చిన హెల్త్‌కార్డుల సమస్యతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సర్వోత్తమ్‌రెడ్డి తెలిపారు.

సర్వోత్తమ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
కాకతీయ విశ్వవిద్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రులు, మేధావులను ఏకతాటిపైకి తీసుకొచ్చిన యువజన విభాగం కృషి అభినందనీయమన్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 4.58 లక్షలకు పైగా పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కాగా, హనుమకొండ జిల్లాలోనే 43,997 మంది నమోదు కావడం కాంగ్రెస్ శ్రేణుల కృషికి నిదర్శనమన్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు ఉన్న ప్రజాబలంతో పాటు పట్టభద్రులు, న్యాయవాదులు, అధ్యాపకుల మద్దతుతో సర్వోత్తమ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్‌రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులు, నిరుద్యోగ యువత, ఉద్యోగుల సమస్యలపై శాసనమండలిలో గొంతుకగా నిలుస్తానన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ అభివృద్ధి, మౌలిక వసతులు, కొత్త సాంకేతిక కోర్సులు, అధ్యాపక నియామకాలు, నిధుల కేటాయింపుల కోసం కృషి చేస్తానని తెలిపారు. సమావేశాల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట నారాయణ, లైబ్రరీ చైర్మన్ ఎండీ అజీజ్ ఖాన్, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు ఎండీ ఆయూబ్ ఖాన్, కుడా చైర్మన్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

