న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించాలి
వరంగల్ పోలీసు అధికారులతో సీపీ సన్‌ప్రీత్‌సింగ్
కాకతీయ, హనుమకొండ : సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే సామాన్య ప్రజలకు తమకు న్యాయం జరుగుతుందనే గట్టి నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్‌స్పెక్టర్లుగా విధులు నిర్వర్తించి ఏసీపీలుగా పదోన్నతి పొందిన గొర్ల సీతారెడ్డి, బోలగాని శ్రీనివాస్ గౌడ్, సార్ల రాజులు శుక్రవారం సీపీ క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీకి పుష్పగుచ్ఛాలు అందజేసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని గుర్తుచేశారు. పైస్థాయి అధికారులుగా తమ పరిధిలోని క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠను, గౌరవాన్ని మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా సమర్థవంతంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. క్రింది స్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు సరైన దిశానిర్దేశం చేస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో క్రియాశీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

