దొరల పాలన కాదు.. ప్రజా పాలన
దళిత స్పీకర్‌ను అవమానిస్తే సహించేది లేదు
తాతా మధుపై కేసు పెట్టి ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలి
బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల తీరుపైనా చర్యలు తీసుకోవాలి
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దేవులపల్లి విజయ్‌కుమార్
కాకతీయ, ఏటూరునాగారం : దళిత సామాజిక వర్గానికి చెందిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను అవమానించేలా ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దేవులపల్లి విజయ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకుల తీరుకు నిరసనగా ఏటూరునాగారం బస్టాండ్‌లో కాంగ్రెస్ నాయకులు తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మండల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విజయ్‌కుమార్ మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీని రాజకీయ రణరంగంగా మార్చడం బాధ్యతారాహిత్యమన్నారు. తాతా మధు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు. బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నల్ల టీషర్టులు ధరించి నినాదాలు చేయడం, పోలీసులతో వాగ్వాదానికి దిగడం, మహిళా పోలీసుల సమక్షంలో అనుచితంగా ప్రవర్తించడం ఖండించాల్సిన విషయమన్నారు. వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దొరల పాలనకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తోందని విజయ్‌కుమార్ అన్నారు. ఉద్యోగులు, కార్మికులు, ప్రజా సంఘాలు తమ సమస్యలపై స్వేచ్ఛగా ఆందోళనలు నిర్వహించే పరిస్థితి కల్పించామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, రాజ్యాంగ వ్యవస్థల గౌరవాన్ని కాపాడటంలో కాంగ్రెస్ రాజీపడబోదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్టీఐ డైరెక్టర్ వాస్తాన శ్రీను, యూత్ జిల్లా అధ్యక్షుడు తాజు, ఆత్మ ములుగు జిల్లా చైర్మన్ చిటమట రఘు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గద్దల నవీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుడ్ల దేవేందర్, మండల యూత్ అధ్యక్షుడు గంట ఠాగూర్, టౌన్ అధ్యక్షుడు రంజిత్, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ వంగపండ్ల రవి తదితరులు పాల్గొన్నారు.

