జంతర్ మంతర్ 2.0కు కొత్త నాయకత్వం
దీప్కే నిర్బంధంలో.. అజింక్య శిందేకు బాధ్యతలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు
నేతల అరెస్టుపై కేజ్రీవాల్ ఆగ్రహం
న్యాయవాదుల నిర్బంధంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అభ్యంతరం
రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు
కాకతీయ, నేషనల్ డెస్క్ : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా తలపెట్టిన జంతర్ మంతర్ 2.0 నిరసనలకు ఇకపై అజింక్య శిందే నాయకత్వం వహిస్తారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. పోలీసులు తమను నిర్బంధంలో ఉంచినంతకాలం నిరసన కార్యక్రమాలు శిందే నేతృత్వంలో కొనసాగుతాయని శనివారం వెల్లడించారు. తనను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని ముందే ఊహించి, శుక్రవారం రాత్రే శిందే నాయకత్వం వహిస్తాడని తెలియజేస్తూ వీడియో రికార్డు చేసినట్లు దీప్కే ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ముంబయి నుంచి దిల్లీలోని జంతర్ మంతర్‌కు వెళ్తున్న అభిజీత్ దీప్కేను శనివారం విమానంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాను కూడా నిర్బంధంలోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం వారిని విమానాశ్రయం నుంచి అజ్ఞాత ప్రాంతానికి తరలించినట్లు కథనంలో పేర్కొన్నారు. పోలీసుల చర్యలతో నిరసనలకు నాయకత్వం వహించే బాధ్యతలను శిందేకు అప్పగిస్తున్నట్లు దీప్కే స్పష్టం చేశారు.
మోదీ ప్రభుత్వంపై కేజ్రీవాల్ విమర్శలు
సీజేపీ నేతల నిర్బంధంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. నిరసనలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీని తలపించే చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎక్స్‌లో పోస్టు చేశారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి వైదొలగాలని, ప్రధాని మోదీ కూడా తప్పుకోవాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో సీజేపీకి మద్దతుగా శాంతియుత నిరసన చేపట్టిన న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న వార్తలపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ స్పందించింది. పోలీసుల బలప్రయోగంపై వచ్చిన వార్తల నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకోవాలని అసోసియేషన్ గౌరవ కార్యదర్శి ప్రజ్ఞా బఘేల్ కోరారు. నిర్బంధంలో ఉన్న న్యాయవాదుల ఆచూకీ, భద్రతను నిర్ధారించాలని, వారికి న్యాయసహాయం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చట్టబద్ధమైన కారణాలు లేని నిర్బంధాలను తొలగించాలని, బలప్రయోగం జరిగి ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు
మరోవైపు దిల్లీలోని ఆకాశవాణి భవన్ సమీపంలో ఇంతియాజ్ అలీ మార్గ్ వద్ద బారికేడ్లను దాటి వచ్చిన 25 నుంచి 30 మంది నిరసనకారులు భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడగా, కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించడంతోపాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 500 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ పలువురు వేర్వేరు ప్రాంతాల నుంచి నిరసన స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నించగా, కొందరిని అదుపులోకి తీసుకుని మరికొందరిని వెనక్కి పంపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు కథనంలో పేర్కొన్నారు.

