దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్
కాకతీయ, గీసుగొండ: పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా గంగదేవిపల్లి శివారులోని ఉషోదయ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. సీఐ డి. విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ విశ్వేశ్వర్ మాట్లాడుతూ ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి షీల్డులను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గీసుగొండ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

