పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య
నెల్లికుదురులో రూ.7.50 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్
రాష్ట్రంలో తొలి పాఠశాలకు ఇక్కడే శంకుస్థాపన
1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో విద్య
అభివృద్ధిలో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం
: రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి
కాకతీయ, నెల్లికుదురు : పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్య, ఆధునిక వసతులు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో రూ.7.50 కోట్లతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవనానికి మంగళవారం ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మంజూరు చేసిన 122 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో మొదటి పాఠశాలకు నెల్లికుదురులో శంకుస్థాపన చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్యను ఒకే ప్రాంగణంలో అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వేం నరేందర్‌రెడ్డి తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి మోడల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసి సుమారు 6,000 మంది విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. నెల్లికుదురులో నిర్మించనున్న పాఠశాలలో ప్రీప్రైమరీ బ్లాక్, డిజిటల్ తరగతి గదులు, ఆధునిక భోజనశాల, రన్నింగ్ ట్రాక్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ వివరించారు.
నెల్లికుదురు అభివృద్ధికి నిధులు
స్థానిక ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ మాట్లాడుతూ నెల్లికుదురు అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందన్నారు. చారిత్రక రంగస్వామి దేవాలయ అభివృద్ధికి రూ.1 కోటి మంజూరైనట్లు తెలిపారు. పాత గెస్ట్‌హౌస్ స్థానంలో జి ప్లస్ వన్ భవనంతోపాటు 20 దుకాణాలు నిర్మించనున్నట్లు చెప్పారు. 1.2 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారి, డివైడర్, సెంట్రల్ లైటింగ్, అంబేద్కర్ కూడలి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ మాట్లాడుతూ జిల్లాలో మెడికల్ కాలేజీ, జేఎన్‌టీయూ, పాలిటెక్నిక్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్రునాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో సుమారు రూ.800 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. రైతులు ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలు సాగు చేయాలని, నీటిని పొదుపుగా వినియోగించాలని వేం నరేందర్‌రెడ్డి సూచించారు. నెల్లికుదురులో 30 పడకల ఆస్పత్రి, ఆధునిక బస్టాండ్, రహదారుల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, స్థానిక సర్పంచ్ పులి వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి, కాంగ్రెస్ నాయకులు భరత్ చందర్‌రెడ్డి, కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మండల అధ్యక్షుడు యాదవరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

