పెంచికలపేట పీఏసీఎస్‌కు కొత్త సారథి!
చైర్మన్‌గా ఎగితే లింగన్న బాధ్యతల స్వీకరణ
గ్రామానికి తొలిసారి దక్కిన అవకాశం
వారానికోసారి రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలి : ఎమ్మెల్యే రేవూరి
కాకతీయ, ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెంచికలపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా ఎగితే లింగన్న బాధ్యతలు స్వీకరించారు. ఈ గ్రామం నుంచి తొలిసారిగా చైర్మన్ పదవి దక్కడంతో గ్రామస్థులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ పీఏసీఎస్ చైర్మన్ల పదవీకాలం ఆరు నెలలు మాత్రమేనని, పనితీరు సంతృప్తికరంగా ఉంటే మరో ఆరు నెలలు పొడిగించే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులకు ప్రభుత్వ పథకాలు, రుణాలు, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి వారం రైతులతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సంఘం కార్యకలాపాల్లో పారదర్శకత పాటిస్తూ పాలకవర్గ సభ్యులందరినీ సమన్వయం చేసుకోవాలని కోరారు. నూతన చైర్మన్ ఎగితే లింగన్న మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశానని, ఇప్పుడు పాలకవర్గ సభ్యులందరితో కలిసి రైతుల సంక్షేమం, సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


