రూ.1.42 లక్షలు కట్టిస్తే.. బిల్లు రూ.80 వేలే!
మెడికవర్ బిల్లింగ్‌పై రోగి ఆవేదన
రూ.62 వేల రిఫండ్ ఎక్కడంటూ ప్రశ్న
కాకతీయ, వరంగల్: ఆసుపత్రిలో చికిత్స కోసం రూ.1.42 లక్షలు చెల్లిస్తే, ఇచ్చిన బిల్లులో మాత్రం రూ.80 వేలు మాత్రమే చూపించారని అయనవోలు గ్రామానికి చెందిన వలుగుల రాజేష్ గౌడ్ ఆరోపించారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని మెడికవర్ ఆసుపత్రి బిల్లింగ్ తీరుపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ముక్కులో ఫంగస్ సమస్యతో అక్టోబర్ 6న ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నానని రాజేష్ తెలిపారు. చికిత్సకు మొత్తం రూ.1,42,000 చెల్లించగా, ఆసుపత్రి ఇచ్చిన బిల్లులో ప్యాకేజీ, అదనపు ఛార్జీలు రూ.1,48,882గా, డిస్కౌంట్ రూ.68,882గా చూపించారని వివరించారు. నెట్ బిల్లు రూ.80,000గా పేర్కొంటూ, రూ.1,42,000 చెల్లించినట్లు, రూ.62,000 రిఫండ్ చేసినట్లు బిల్లులో నమోదు చేశారని తెలిపారు.

రిఫండ్‌కు ఆధారాలేవి?
ముఖ్యమంత్రి సహాయనిధి కోసం బిల్లులు తీసుకునేందుకు వెళ్లినప్పుడు ఈ వ్యత్యాసం గుర్తించానని రాజేష్ పేర్కొన్నారు. రూ.62 వేలు తన ఖాతాలో జమ అయినట్లు బ్యాంకు ఆధారం చూపాలని కోరగా, పొరపాటు జరిగిందని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని సిబ్బంది చెప్పినట్లు తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం స్పందించి రిఫండ్ లావాదేవీ వివరాలు వెల్లడించాలని, బిల్లులో పొరపాటు ఉంటే సరిచేసి న్యాయం చేయాలని కోరారు. ఈ ఆరోపణలపై ఆసుపత్రి యాజమాన్యం వివరణ అందుబాటులో లేదు.

