పీఆర్సీ కోసం పోరాటానికి సిద్ధం కావాలి!
నివేదిక బహిర్గతం చేసి వెంటనే అమలు చేయాలి
పెండింగ్ డీఏలు, బిల్లులు విడుదల చేయాలి
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి పిలుపు
కాకతీయ, హనుమకొండ: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పీఆర్సీని వెంటనే అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. శుక్రవారం టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల ముఖ్య కార్యకర్తలు, ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి అమలు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు, బిల్లుల విడుదల చేస్తామని హామీ ఇచ్చి 40 నెలలైనా పరిష్కరించలేదని విమర్శించారు. సర్వీస్ రూల్స్, ఉపాధ్యాయుల పదోన్నతులు, ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడి నియామకం చేపట్టాలని కోరారు. మోడల్ స్కూల్, కేజీబీవీ, గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రంజిత్‌కుమార్, జిల్లా నాయకులు పెండెం రాజు, సీహెచ్. రవీందర్‌రాజు, తాటికాయల కుమార్, సి. సుజన్ ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

