దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
– వారసత్వ భూమి వ్యవహారంలో రూ.10 వేల లంచం తీసుకుంటూ ఆర్ఐ పట్టివేత
కాకతీయ, దుగ్గొండి: తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. వారసత్వ భూమికి సంబంధిత ఫైల్ పరిష్కారం కోసం రూ.10 వేల లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే మండలంలోని మధిర గ్రామానికి చెందిన లొల్లాటి రాజు తన తండ్రి నర్సయ్య మరణంతో తన తండ్రి పేరు మీద ఉన్న 27 గుంటల వ్యవసాయ భూమి పట్టా చేసుకునేందుకు వారసత్వ భూమి నమోదు ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోగా, సంబంధిత ఫైల్‌ను ముందుకు జరిపేందుకు ఆర్ఐ రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలోనే లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు ఆర్ఐను అదుపులోకి తీసుకుని, నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించి, సంబంధిత పత్రాలను సీజ్ చేసినట్లు తెలిసింది. ఈ ఘటనతో తహసీల్దార్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

