కార్ల అటాచ్‌మెంట్ పేరుతో మోసం
ఐటీ కంపెనీల్లో భారీ అద్దె ఆశ చూపి వాహనాల తాకట్టు
మోసాలకు పాల్పడిన ఇద్దరు అరెస్ట్.. మూడు కార్లు స్వాధీనం
కాకతీయ, వరంగల్ బ్యూరో : ఐటీ కంపెనీల్లో కార్లను అటాచ్‌మెంట్ ఇప్పిస్తామని, నెలకు భారీ అద్దె వస్తుందని నమ్మించి వాహన యజమానులను మోసం చేసిన ముఠాకు చెందిన ఇద్దరిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏ.జే. మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మూడు కార్లు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రధాన నిందితుడు సింగారపు శ్యామ్ కుమార్ (ఏ1), ఎం.డి. సోహైల్ (ఏ2) కలిసి, ఐటీ కంపెనీల్లో కార్లు అటాచ్‌మెంట్ ఇప్పిస్తామని, నెలకు రూ.35 వేల వరకు అద్దె వస్తుందని వాహన యజమానులను నమ్మించారు. యజమానుల నుంచి కార్లను తీసుకుని, ప్రారంభంలో నమ్మకం కోసం మొదటి నెల అద్దెను చెల్లించి, ఆ తర్వాత కార్లను ఇతరుల వద్ద తాకట్టు పెట్టేవారు. అద్దె ఇవ్వకుండా, అసలు కార్లను కూడా తిరిగి ఇవ్వకుండా యజమానులను మోసం చేసేవారు.
వాహన తనిఖీల్లో పట్టుబడిన నిందితులు
జూలై 9న తెలంగాణ జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, నిందితులు అనుమానాస్పదంగా సంచరిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని విచారించగా మోసం బయటపడింది. నిందితుల వద్ద ఒక మారుతి డిజైర్ కారును, వారిచ్చిన సమాచారంతో చింతల్ ఫ్లైఓవర్ కింద దాచిపెట్టిన మరో రెండు కార్లను (మారుతి ఎర్టిగా, మారుతి బలెనో) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు శ్యామ్ కుమార్ గతంలో కూడా ఇటువంటి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇతనిపై చెన్నారావుపేట, ఇంతేజార్‌గంజ్, ఏ.జే. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, డిజిటల్, ఆర్థిక లావాదేవీల ఆధారాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఏ.జే. మిల్స్ కాలనీ పోలీసులు తెలిపారు.

