డిసెంబర్‌లో ‘స్లమ్‌డాగ్.. 33 టెంపుల్ రోడ్’?
విజయ్ సేతుపతి–పూరీ జగన్నాథ్ కాంబోపై ఆసక్తి
సెప్టెంబర్, అక్టోబర్‌లో సేతుపతి చిత్రాల విడుదల
వాటి తర్వాతే పూరీ సినిమా విడుదలకు సన్నాహాలు
కాకతీయ,సినిమా : వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’పై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తికాగా.. టీజర్‌తో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు నాన్ థియేట్రికల్ డీల్స్‌ను పూర్తి చేసే పనిలో చిత్రబృందం ఉంది. విజయ్ సేతుపతికి తమిళంలో మంచి మార్కెట్ ఉండటంతో తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే సేతుపతి నటించిన ఇతర చిత్రాల విడుదల తేదీలు ఈ సినిమా రిలీజ్‌పై ప్రభావం చూపుతున్నాయి. ‘ట్రైన్’ సెప్టెంబర్‌కు వాయిదా పడగా.. ‘బత్తా’ను అక్టోబర్ 1న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ రెండు చిత్రాలు వరుసగా థియేటర్లలోకి రానుండటంతో ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ను వాటి తర్వాత విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్‌లో పూరీ జగన్నాథ్–విజయ్ సేతుపతి కాంబినేషన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

