రూ.160 కోట్లకు ‘జైలర్ 2’ ఓటీటీ డీల్!
అమెజాన్ ప్రైమ్ వీడియోకు డిజిటల్ హక్కులు
తొలి భాగం కంటే భారీగా పెరిగిన ధర
అక్టోబర్ 15న థియేటర్లలో విడుదల
కాకతీయ, సినిమా : సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ చిత్రానికి సంబంధించి ఓటీటీ డీల్ సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.160 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ‘జైలర్’ తొలి భాగం డిజిటల్ హక్కులు రూ.100 కోట్లకు అమ్ముడైనట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు సీక్వెల్‌కు అంతకుమించిన మొత్తానికి డీల్ కుదిరినట్లు సమాచారం. దీంతో తమిళ చిత్ర పరిశ్రమలో భారీ ఓటీటీ ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 15, 2026న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా రజనీకాంత్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. విజయ్ కార్తీక్ కణ్ణన్ ఛాయాగ్రహణం వహిస్తున్నారు. థియేట్రికల్ విడుదలకు ముందే భారీ మొత్తానికి ఓటీటీ హక్కులు విక్రయమైనట్లు వార్తలు రావడం సినిమాపై నెలకొన్న అంచనాలను మరింత పెంచుతోంది.

