సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
పైలాన్, నూతన కలెక్టరేట్ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి
కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
కాకతీయ, ములుగు ప్రతినిధి : ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి ములుగు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను వేగవంతం చేసి, అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీకి సూచించారు. మేడారంలో వనదేవతల దర్శనం, తులాభారం, పింఛన్ల పంపిణీతో పాటు నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం, సభా ప్రాంగణంలో ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.
పైలాన్ పనులు తుదిదశకు
అనంతరం గట్టమ్మ వద్ద నిర్మిస్తున్న పైలాన్ పనులను పరిశీలించి, మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి సుందరీకరణ పనులు పూర్తి చేయాలన్నారు. నూతన కలెక్టరేట్‌లో పూజా కార్యక్రమం, సమావేశపు గది, రాష్ట్ర ఛాంబర్, లిఫ్ట్, జనరేటర్, విద్యుత్, తాగునీరు, పారిశుధ్య సదుపాయాలను పరిశీలించారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా లిఫ్ట్, జనరేటర్, విద్యుత్ వ్యవస్థలను ముందుగానే పరీక్షించాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో విధులు నిర్వహించి, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, సంపత్ రావు, ఆర్డీవో కృష్ణవేణి, డీఆర్వో రవికుమార్, ఆర్‌అండ్‌బీ అధికారి శ్యామ్ సింగ్, మున్సిపల్ కమిషనర్ సంపత్, ఎస్‌ఈ ఈడీ ధర్మ నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

