ఆత్మకూరుకు కొత్త రూపు
29.08 ఎకరాల్లో అత్యాధునిక టౌన్‌షిప్
విశాల రహదారులు.. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ
పార్కులు, కమ్యూనిటీ వసతులతో అభివృద్ధి
వరంగల్ నగర విస్తరణకు కొత్త దిశ
కాకతీయ, హనుమకొండ : వరంగల్ మహానగర విస్తరణలో భాగంగా ఆత్మకూరు కొత్త రూపు సంతరించుకోనుంది. ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధికి అనుగుణంగా అత్యాధునిక వసతులతో టౌన్‌షిప్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘టౌన్‌షిప్ అండ్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్’కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గత ఆదివారం శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు మండల కేంద్రంలో 29.08 ఎకరాల విస్తీర్ణంలో ఈ బృహత్తర ప్రాజెక్టును చేపట్టనున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని టౌన్‌షిప్‌ను రూపకల్పన చేశారు. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా నివాస ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడంతోపాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చనున్నారు. సాధారణ కాలనీలకు భిన్నంగా అన్ని సౌకర్యాలను ఒకేచోట అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రాజెక్టును రూపొందించారు. విశాలమైన రహదారులు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరా, ఆధునిక పార్కులు, కమ్యూనిటీ వసతులను ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దనున్నారు. పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పార్కులను అభివృద్ధి చేయనున్నారు.
ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధి
వరంగల్ మహానగర పరిధి క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆత్మకూరు వైపు కూడా పట్టణీకరణ వేగం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు సరిపడేలా ముందుగానే మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా అనియంత్రిత నిర్మాణాలకు అవకాశం లేకుండా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి బాటలు వేయనున్నారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఆత్మకూరు ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారనుంది. టౌన్‌షిప్‌లో ఏర్పాటు చేసే రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, పార్కులు, కమ్యూనిటీ సదుపాయాలు భవిష్యత్ జనాభా అవసరాలకు అనుగుణంగా ఉండేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో ఈ ప్రాంతంలో నివాస సౌకర్యాలతోపాటు మౌలిక వసతులు మెరుగుపడే అవకాశం ఉంది.
వరంగల్ విస్తరణకు ఊతం
కుడా పరిధిలో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆత్మకూరు ప్రాంత రూపురేఖలు మారడంతోపాటు వరంగల్ మహానగర విస్తరణకు మరింత ఊతం లభించనుంది. పట్టణాభివృద్ధిని ఒక క్రమపద్ధతిలో ముందుకు తీసుకెళ్లేందుకు ఈ టౌన్‌షిప్ ఒక నమూనాగా నిలవనుంది. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆధునిక పట్టణ సదుపాయాలతో మోడల్ టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు దనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు హాజరయ్యారు.

