మోదీకి కేబినెట్ అభినందనలు
గుజరాత్ నుంచి దేశ నాయకత్వం వరకు 25 ఏళ్ల ప్రస్థానం
‘నేషన్ ఫస్ట్–సిటిజన్ ఫస్ట్’కు మోదీ ప్రయాణం నిదర్శనం
సంక్షేమాన్ని ఆత్మగౌరవంగా మార్చిన విధానాలు
సంస్కరణలు, మౌలిక వసతులతో స్వయం సమృద్ధి భారత్
జాతీయ భద్రత నుంచి అంతర్జాతీయ వేదిక వరకు కీలక మైలురాళ్లు
కేంద్ర మంత్రివర్గ తీర్మానంలో ప్రధాని నరేంద్ర మోదీ
కాకతీయ,నేషనల్ డెస్క్ : గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్ల నిరంతర నాయకత్వ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రివర్గం అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా మోదీ ప్రయాణం కేవలం పదవుల రికార్డు కాదని, ‘నేషన్ ఫస్ట్–సిటిజన్ ఫస్ట్’ సిద్ధాంతానికి నిదర్శనమని కేబినెట్ పేర్కొంది. గుజరాత్‌లో వరుసగా 3 విజయాలు, దేశవ్యాప్తంగా వరుసగా 3 లోక్‌సభ ఎన్నికల్లో లభించిన ప్రజా మద్దతును ఆయన నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ప్రతీకగా అభివర్ణిస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. గుజరాత్‌లో మోదీ అమలు చేసిన పరిపాలనా విధానాలు దేశవ్యాప్తంగా విస్తరించాయని కేబినెట్ తీర్మానం పేర్కొంది. ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు గుజరాత్‌లో అమలు చేసిన స్వాగత్ కార్యక్రమం 2010లో ఐక్యరాజ్యసమితి పబ్లిక్ సర్వీస్ అవార్డు పొందిందని, అదే స్ఫూర్తితో కేంద్రంలో ప్రగతి వేదికను ఏర్పాటు చేసి పెండింగ్ ప్రాజెక్టుల సమీక్ష, వేగవంతమైన అమలుకు ఉపయోగించారని తెలిపింది. వ్యవసాయానికి ప్రత్యేక విద్యుత్ అందించిన జ్యోతిగ్రామ్ తరహా విధానాన్ని దేశవ్యాప్తంగా సాగు రంగానికి మార్గదర్శకంగా పేర్కొంది.
పేదల సంక్షేమం.. ఆత్మగౌరవానికి ప్రాధాన్యం
పేదరికాన్ని స్వయంగా చూసిన నేపథ్యంతో మోదీ సంక్షేమ విధానాలను రూపొందించారని తీర్మానంలో పేర్కొన్నారు. 60 కోట్లకు పైగా జన్‌ధన్ ఖాతాలు, 4 కోట్లకు పైగా పక్కా ఇళ్లు, 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడటం వంటి అంశాలను ప్రస్తావించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు వారి ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా పాలన సాగిందని కేబినెట్ అభిప్రాయపడింది. మహిళలు, రైతులు, యువత, గిరిజనులు సహా వివిధ వర్గాలను అభివృద్ధిలో భాగస్వాములను చేసే విధానాలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపింది. 3.5 కోట్ల మంది మహిళలు ‘లఖ్‌పతి దీదీ’లుగా ఎదిగినట్లు తీర్మానంలో పేర్కొన్నారు. నారీ శక్తి వందన్ అధినియమం ద్వారా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లకు మార్గం ఏర్పడిందని తెలిపారు. పీఎం–కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి రూ.4 లక్షల కోట్లకు పైగా నిధులు చేరాయని పేర్కొన్నారు. స్టార్టప్‌లు, విద్యా సంస్కరణలు యువతకు అవకాశాలను విస్తరించాయని, అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పీఎం–జన్‌మన్ కార్యక్రమం తోడ్పడుతోందని కేబినెట్ తెలిపింది.
సాహసోపేత సంస్కరణలకు ప్రాధాన్యం
రాజకీయ నష్టాల గురించి ఆలోచించకుండా దేశ ప్రయోజనాల కోసం సాహసోపేత సంస్కరణలను చేపట్టినట్లు తీర్మానం పేర్కొంది. వస్తు సేవల పన్ను, సంక్షేమ ఫలాల ప్రత్యక్ష బదిలీ, వలస పాలన కాలం నాటి పాత చట్టాల రద్దు వంటి చర్యలు పరిపాలనలో మార్పులకు దారితీశాయని తెలిపింది. స్వచ్ఛ భారత్, డిజిటల్ చెల్లింపులు, వోకల్ ఫర్ లోకల్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములను చేశారని పేర్కొంది. మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వ మూలధన వ్యయం రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.12 లక్షల కోట్లకు పైగా పెరిగిందని తీర్మానంలో పేర్కొన్నారు. హైవేల విస్తరణ, రైల్వేల విద్యుదీకరణ వేగవంతమయ్యాయని, దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.13 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. రక్షణ రంగ ఉత్పత్తులు, సెమీకండక్టర్ల తయారీలో దేశీయ సామర్థ్యాన్ని పెంచే చర్యలకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు.
సాంకేతికతను ప్రజా సేవకు సాధనంగా
జన్‌ధన్, ఆధార్, మొబైల్ అనుసంధానం, యూపీఐ వంటి సాంకేతిక వ్యవస్థలు ప్రజల జీవనాన్ని సులభతరం చేశాయని కేబినెట్ తీర్మానం పేర్కొంది. స్వదేశీ కొవిడ్ వ్యాక్సిన్ల అభివృద్ధి, చంద్రయాన్–3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడం వంటి విజయాలను ప్రస్తావించింది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ సాంకేతికతల్లో భారత్ సామర్థ్యాన్ని పెంచుకుంటోందని తెలిపింది. కరోనా మహమ్మారి సమయంలో దేశాన్ని సమన్వయంతో నడిపించి భారీ స్థాయిలో టీకా కార్యక్రమాన్ని పూర్తి చేశారని తీర్మానం పేర్కొంది. పశ్చిమాసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ పరిణామాల సమయంలో సమయానుకూల నిర్ణయాలు, ఇంధన భద్రత చర్యలతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారని తెలిపింది.
జాతీయ భద్రతపై దృఢ వైఖరి
2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ వైమానిక దాడులు, 2025 ఆపరేషన్ సిందూర్‌ను జాతీయ భద్రతపై ప్రభుత్వ వైఖరికి ఉదాహరణలుగా కేబినెట్ తీర్మానం పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవి ఏర్పాటు వంటి చర్యలను కీలక మైలురాళ్లుగా ప్రస్తావించింది. మావోయిస్టు సమస్య నియంత్రణ, ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి ఒప్పందాలు దేశంలో స్థిరత్వానికి దోహదం చేశాయని పేర్కొంది. గ్లోబల్ సౌత్ దేశాల గళాన్ని వినిపించడంలో, జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌ను చేర్చడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని తీర్మానం పేర్కొంది. కరోనా సమయంలో వ్యాక్సిన్ మైత్రి ద్వారా పలు దేశాలకు భారత్ సహకరించిందని తెలిపింది. మోదీకి 36 దేశాలు అత్యున్నత పౌర పురస్కారాలు అందించడం అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు లభించిన గుర్తింపుగా కేబినెట్ పేర్కొంది. అభివృద్ధిని పర్యావరణ పరిరక్షణతో, భారతీయ సంస్కృతితో అనుసంధానించే విధానాలకు మోదీ ప్రాధాన్యం ఇచ్చారని తీర్మానం పేర్కొంది. గుజరాత్‌లో ప్రారంభమైన పర్యావరణ పరిరక్షణ చర్యలు గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ భాగస్వామ్యాల వరకు విస్తరించాయని తెలిపింది. యోగా, తృణధాన్యాల ప్రాచుర్యం, కాశీ విశ్వనాథ్ ధామ్ పునరుద్ధరణ, అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణప్రతిష్ఠ వంటి అంశాలను భారత సాంస్కృతిక వారసత్వ పునరుజ్జీవనంతో అనుసంధానించింది. మోదీ 25 ఏళ్ల నిరంతర పాలనా నాయకత్వాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తీర్మానంలో ఈ 10 అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది.

