12న ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర ఆలయానికి భూమి పూజ
చిన్నజీయర్ స్వామీజీని ఆహ్వానించిన మంత్రి తుమ్మల
కాకతీయ, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో నూతనంగా నిర్మించతలపెట్టిన శ్రీ వెంకటేశ్వర దివ్యక్షేత్ర శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త్రిదండి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామీజీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామీజీని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి తుమ్మల పాదాభివందనం చేసి దివ్యాశీస్సులు అందుకున్నారు. ఈ నెల 12న ఖమ్మం పట్టణంలో నిర్వహించనున్న శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమం శ్రీ చిన్నజీయర్ స్వామీజీ అమృతహస్తాల మీదుగా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఖమ్మం జిల్లా ప్రజలతోపాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామీజీ దివ్యాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

