ఆవిష్కరణలకు వేదిక ‘టెక్నోజియన్’
నేటి నుంచి ఎన్ఐటీ వరంగల్‌లో సాంకేతిక సంబరం
రెండు రోజుల పాటు 50కి పైగా కార్యక్రమాలు
రోబోటిక్స్, సైబర్ భద్రత, స్టార్టప్ ఛాలెంజ్‌లతో సందడి
అక్టోబర్ 30, 31 తేదీల్లో వేడుకలు
ప్రారంభోత్సవానికి ఈవీ రంగ నిపుణుడు కమల్ కిషోర్ వోరా
విద్యార్థుల సృజనాత్మకతకు అంతర్జాతీయ స్థాయి వేదిక
కాకతీయ, వరంగల్ : విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు, పరిశోధనా తృష్ణ, సృజనాత్మక ఆలోచనలను వెలికితీసే లక్ష్యంతో ఎన్ఐటీ వరంగల్ నిర్వహిస్తున్న వార్షిక సాంకేతిక ఉత్సవం ‘టెక్నోజియన్–26’కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబర్ 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు క్యాంపస్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. రోబోటిక్స్, సైబర్ భద్రత, స్టార్టప్ ఆలోచనలు, సాంకేతిక ప్రదర్శనలతో విద్యార్థులకు తమ ప్రతిభను చాటుకునే అవకాశం కల్పించనున్నారు.
ఎన్ఐటీ వరంగల్‌లో 2006లో ప్రారంభమైన టెక్నోజియన్ దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యార్థులను ఆకర్షిస్తున్న సాంకేతిక ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తరగతి గదుల్లో నేర్చుకున్న సిద్ధాంతాలను వాస్తవ ప్రపంచ సమస్యలకు అన్వయించడం, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. రోబోటిక్స్, కృత్రిమ మేధ, విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో విద్యార్థుల ఆలోచనలకు వేదికగా నిలుస్తోంది.
ఉదయం 9.30 గంటలకు ప్రారంభం
అక్టోబర్ 30న ఉదయం 9.30 గంటలకు ఇన్స్టిట్యూట్లోని అకడమిక్ లెర్నింగ్ సెంటర్లో ఉత్సవం ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవానికి ఒలెక్ట్రా వైస్ ప్రెసిడెంట్ (ఇన్నోవేషన్ అండ్ స్ట్రాటజీ పార్ట్నర్షిప్), అతుల్ ఆటో ఇండిపెండెంట్ డైరెక్టర్, ఏఆర్ఏఐ మాజీ సీనియర్ డిప్యూటీ డైరెక్టర్, విద్యుత్ వాహనాల నిపుణుల బృంద సభ్యుడు కమల్ కిషోర్ వోరా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి విశిష్ట అతిథిగా పాల్గొంటారు. రెండు రోజుల వేడుకల్లో 50కి పైగా సాంకేతిక పోటీలు నిర్వహించనున్నారు. రోబోటిక్స్ పోటీలు, కొత్త వ్యాపార ఆలోచనలకు ఊతమిచ్చే స్టార్టప్ ఛాలెంజ్, సైబర్ భద్రతపై ప్రతిభను పరీక్షించే హ్యాకథాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యక్ష అనుభవాన్ని అందించే వర్క్‌షాప్‌లు, సాంకేతిక ప్రదర్శనలూ ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యార్థులు, ఆవిష్కర్తలు ఇందులో పాల్గొననున్నారు.
విద్యార్థుల సమన్వయంతో ఏర్పాట్లు
ఎన్ఐటీ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కె. కిరణ్ కుమార్ (డీన్, స్టూడెంట్ వెల్ఫేర్), ప్రొఫెసర్ వెలగపూడి వాసు (ప్రెసిడెంట్, ఎస్ఏసీ), ప్రొఫెసర్ వెంకన్న ఉడుతలపల్లి (వైస్ ప్రెసిడెంట్, టెక్నికల్) పర్యవేక్షణలో ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థి మండలి టెక్నికల్ సొసైటీ కార్యదర్శి ధీరజ్ బి., సంయుక్త కార్యదర్శి విష్ణు వర్ధన్ నేతృత్వంలోని విద్యార్థి బృందం ఏర్పాట్లను సమన్వయం చేసింది. పూర్తి వివరాలు, తాజా సమాచారం కోసం technozion.nitw.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

