దమ్ముంటే బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి
నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ గెలుపుతో బీజేపీకి భయం
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పెరుమాండ్ల రామకృష్ణ డిమాండ్
కాకతీయ, హైదరాబాద్: బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈవీఎంలను రద్దు చేసి, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డా. పెరుమాండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరగడాన్ని ప్రస్తావిస్తూ, అన్ని ఎన్నికల విధానాలపై బీజేపీ స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కోరారు. నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ గెలుపుతో బీజేపీకి భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉండాలని, ప్రతి ఓటు భద్రంగా ఉందనే నమ్మకం కల్పించడం ముఖ్యమన్నారు. ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్వర్ కుమార్‌పై ఆరోపణలు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలను రాజకీయ విమర్శలకు ఉపయోగించకుండా, బ్యాలెట్ పద్ధతిపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

