వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలే మేలు!
నీటి వనరుల సంరక్షణతో ఆధునిక సాగు పద్ధతులు
యాసంగిలో పంటల మార్పిడికి ప్రాధాన్యత ఇవ్వాలి
హన్మకొండ అదనపు కలెక్టర్ రవి సూచన
కాకతీయ, హసన్‌పర్తి: యాసంగిలో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రవి రైతులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావం, భూగర్భ జలాల తగ్గుదల, విద్యుత్ అంతరాయాలను దృష్టిలో ఉంచుకొని నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. హసన్‌పర్తి మండలం నాగారం రైతు వేదికలో నిర్వహించిన ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భూసార పరీక్షలు చేయించుకొని నేల స్వభావానికి అనుగుణంగా ఎరువులు వినియోగించాలని, నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవడంతో పాటు పంటల మార్పిడి, చీడపీడల నివారణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర మాట్లాడుతూ పంట కొయ్యలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని, వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కమలాకర్ రెడ్డి నీటి లభ్యతను బట్టి ఆయిల్‌పామ్, కూరగాయల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. వేరుశెనగ, పొద్దుతిరుగుడు, పెసర, మినుము, అలసంద, జొన్న వంటి పంటలను ప్రత్యామ్నాయంగా సాగు చేయాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు ఆది రెడ్డి, టీకేవీకే శాస్త్రవేత్త నర్సయ్య, డీఎం టీజీ ఆయిల్‌ఫెడ్ శంకర్, మండల వ్యవసాయ అధికారి అనురాధ, ఏఈ తరుణ్, వీఏఎస్లు దీపిక, రమేష్, ఆత్మకూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తంగళ్లపెల్లి తిరుపతి, సర్పంచ్ సందరాజు లావణ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు శైలజ, సాయి, రైతులు పాల్గొన్నారు.

