పింఛన్ల కోసం పైసల వసూళ్లపై పూర్తిస్థాయి విచారణ చేపడతాం…
*బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవు..
*కాకతీయ కథనానికి స్పందించిన గీసుగొండ ఇన్‌చార్జి ఎంపీడీఓ, ఎంపీఓ శ్రీధర్
కాకతీయ, గీసుగొండ: ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పింఛన్ల మంజూరు కోసం లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కాకతీయ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై గీసుగొండ ఇన్‌చార్జి ఎంపీడీఓ,ఎంపీఓ శ్రీధర్ స్పందించారు. పింఛన్ల మంజూరు పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.1,300 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అందాల్సిన ప్రయోజనాల కోసం ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో డబ్బులు వసూలు చేసిన వారి నుంచి బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఘటనలో ఎవరెవరి పాత్ర ఉందనే విషయాన్ని క్షుణ్ణంగా విచారించి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పింఛన్ల మంజూరు పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


