ట్రాన్స్ఫార్మర్ల కేంద్రంతో విద్యుత్ సమస్యలకు చెక్
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్
మండలకేంద్రంలో భూమి పూజ..
కాకతీయ, నెల్లికుదురు: ప్రజలు విద్యుత్ సమస్యలతో ఇబ్బంది పడకుండా అందుబాటులో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని జాతీయ ఎస్ టి కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తెలిపారు. నెల్లికుదురు మండల కేంద్రంలో ఎస్ వి ఎస్ ఇండస్ట్రీ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్ కేంద్రానికి ఆదివారం జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
నెల్లికుదురు మండల కేంద్రంలో ఎస్ వి ఎస్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్ కేంద్రం ఏర్పాటు కోసం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తినప్పుడు త్వరితగతిన మరమ్మతులు చేయడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సత్వర సేవలు అందించడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
స్థానికుల పాత్ర ప్రశంసనీయం
ఈ కేంద్రం ఏర్పాటు కోసం ముందుండి కృషి చేసిన తోట రమేష్, సురేష్ లను ఆయన అభినందించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు రాజ్ కుమార్, జిల్లా నాయకులు పాపారావు, యాకన్న, సుందర్, శివ సాయి, దుస్స యాకన్న తదితరులు పాల్గొన్నారు.

