గ్రామ సభలు సమస్యల పరిష్కారానికి దోహదం
వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు
ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్
కాకతీయ, ఇనుగుర్తి : గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రామ సభలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం ఇనుగుర్తి మండలంలోని ఇనుగుర్తి, లాలు తండా, రాము తండా గ్రామపంచాయతీలలో నిర్వహించిన గ్రామసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు గ్రామ సభలకు హాజరై తమ సమస్యలను అధికారులకు తెలియజేయాలని సూచించారు. గ్రామ పాలక మండలి, మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా వేసవికాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సర్పంచులకు సూచించారు. గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో పార్థసారథి, సర్పంచులు తమ్మడపల్లి కుమార్, భూక్య లక్ష్మీ వెంకన్న నాయక్, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

