రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్న… ముగ్గురికి గాయాలు
కాకతీయ / దుగ్గొండి: దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామ పరిధిలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దుగ్గొండి మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బాలుడిని ఊరుగొండ గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు హాస్టల్ నుంచి తీసుకెళ్తుండగా, రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్నకు అడ్డంగా ఉంచిన రాళ్లు వాహనానికి తగిలి అదుపు తప్పినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 108 అంబులెన్స్ సేవకు సమాచారం అందించారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.
రోడ్డుపై పంటలను ఆరబెట్టడం, రాళ్లు పెట్టడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని రోడ్లపై అడ్డంకులను తొలగించాలని కోరుతున్నారు.

