దళారులను నమ్మి మోసపోవద్దు
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
మానుకోట ఎమ్మెల్యే మురళి నాయక్
ఆలేరు, రాజుల కొత్తపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
కాకతీయ, నెల్లికుదురు: రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, అన్నదాతలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ భరోసా ఇచ్చారు. మంగళవారం మండలంలోని ఆలేరు, రాజుల కొత్తపల్లి గ్రామాల్లో శ్రీరామగిరి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు దళారీల బారిన పడి నష్టపోకుండా ఉండేందుకే ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీ, పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్, రైతు భరోసా వంటి పథకాలను అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని గుర్తు చేశారు. వాతావరణ మార్పుల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలతో ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు విమర్శలు చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద నరేష్, సర్పంచులు అశోక్ కుమార్, రామ్ సింగ్, ప్రశాంత్, అరుణ ఆనంద్, ఏపీఎం నరేంద్ర కుమార్, ఏఎంసీ డైరెక్టర్లు నరేందర్, మల్లేశం, పి.ఐ.సి రమేష్, నాయకులు యాదవ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

