వల్లబ్‌నగర్‌లో వైభవంగా శివలింగ ప్రాణ ప్రతిష్ఠ
వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
ఐదు రోజులుగా కొనసాగుతున్న మహాదేవ ఉత్సవాలు
కాకతీయ, నర్సంపేట టౌన్:- నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వల్లబ్‌నగర్‌లో శ్రీశ్రీశ్రీ మహాదేవ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రధాన ఘట్టమైన శివలింగ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ వేడుకకు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆహ్వానం మేరకు ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు వేద పండితులు, దేవాలయ కమిటీ ప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకుల ఆధ్వర్యంలో జరిగిన హోమ గుండం, ప్రతిష్ఠాపన పూజల్లో ఎమ్మెల్యే పాల్గొని శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ప్రార్థించారు. పూజా అనంతరం పండితులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఉత్సవాల్లో భాగంగా పరిహార దేవత, ధ్వజస్తంభ ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు భక్తుల సమక్షంలో కనులపండువగా సాగాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ కమిటీ సభ్యులు మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

