గిరిజన సమస్యలకు త్వరితగతిన పరిష్కారం
ఐటీడీఏ దర్బార్‌లో 15 వినతుల స్వీకరణ
పట్టా పుస్తకాలు, ఉపాధిపై గిరిజనుల విజ్ఞప్తి
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : గిరిజన దర్బార్‌కు వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఐటీడీఏ యంత్రాంగం ఆదేశించింది. సోమవారం ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు గిరిజన దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి. ప్రతాప్, డిప్యూటీ డైరెక్టర్ డి. జనార్ధన గిరిజనుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈ దర్బార్‌లో వివిధ మండలాల నుంచి వచ్చిన గిరిజనులు మొత్తం 15 దరఖాస్తులను సమర్పించారు. ప్రధానంగా భూమి హక్కులు, పట్టా పాస్ పుస్తకాల జారీ, ఉపాధి అవకాశాలు, వైద్య సహాయం మరియు మౌలిక వసతులపై విన్నవించారు. వెంకటాపురం మండలం రామచంద్రపురం గ్రామస్థులు తమ సాగు భూములకు పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఆకులవారి ఘనపురంలో గుడిసెలపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయాలని, ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల నియామకాలు చేపట్టాలని గిరిజన సంఘాల నేతలు కోరారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు..
అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖలకు పంపించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులు సూచించారు. గిరిజనుల సమస్యల పరిష్కారంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ ఎం. రాజ్‌కుమార్, ఎస్‌ఓ ఎం. సురేష్ బాబు, డిప్యూటీ డీఎంహెచ్ఓ కె. క్రాంతి కుమార్, ఆఫీస్ మేనేజర్ వి. శ్రీనివాస్, జేడీఎం కొండల రావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

