విద్యుత్ పనులు వేగంగా పూర్తి చేయాలి
అంతరాయం లేని సరఫరాయే లక్ష్యం
ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
కాకతీయ, ములుగు ప్రతినిధి : వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ములుగు జిల్లాలో పర్యటించి పలు విద్యుత్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా ములుగులో నూతనంగా నిర్మిస్తున్న డిపార్ట్మెంటల్ ఎస్పీఎం షెడ్ పనులను తనిఖీ చేసి, జూన్ నెలాఖరు నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. అనంతరం ప్రైవేట్ ఎస్పీఎం షెడ్‌ను సందర్శించిన సీఎండీ.. పాడైన ట్రాన్స్ఫార్మర్ల రికార్డులను, వాటి మరమ్మతు విధానాన్ని పరిశీలించారు. మరమ్మతుల ప్రక్రియను వేగవంతం చేసి రోలింగ్ స్టాక్‌ను పెంచుకోవాలని, తద్వారా అవసరమైన చోట వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్లను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పస్రా సెక్షన్ పరిధిలో నిర్మిస్తున్న నూతన కార్యాలయ పనులను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఆదేశించారు.
సరఫరాలో నాణ్యత మెరుగు
కర్లపల్లి నుంచి లింగాల కొత్త సబ్ స్టేషన్ వరకు సుమారు 27 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం గుండా వేస్తున్న 33 కేవీ లైన్ పనులను సీఎండీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 33/11 కేవీ లింగాల సబ్ స్టేషన్ ద్వారా గుండాల, కొడిశెల, లింగాల పరిసర గ్రామాల్లో లో-వోల్టేజ్ సమస్య తీరుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ అందుతుందని, అంతరాయాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఈ రాజు చౌహన్, ఎస్ఈ బేతి బిక్షపతి, డీఈలు నాగేశ్వర్ రావు, పురుషోత్తం, సదానందం మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

