ఆపరేషన్ ‘గుప్తనిధి’
గొలుసుకట్టు ఆలయాలే టార్గెట్
అశోక్‌నగర్ గుడి కూల్చివేత వెనుక భారీ స్కెచ్?
ఖిలా వరంగల్ – రామప్ప ‘సొరంగ’ మార్గంపై కేటుగాళ్ల నిఘా
అప్పుడు గుప్త నిధుల వేటగాళ్లు
ఇప్పుడు కాంట్రాక్టర్లు.. తెరవెనుక ఎవరున్నారు?
కాకతీయ, నిఘా ప్రతినిధి : కాకతీయ సామ్రాజ్య వైభవానికి ప్రతీకలైన చారిత్రక కట్టడాలు ఇప్పుడు గుప్తనిధుల వేటగాళ్లకు అడ్డాగా మారుతున్నాయి. ఖిలా వరంగల్ కోట నుంచి రామప్ప వరకు ఉన్నట్లుగా ప్రచారంలో ఉన్న అంతుచిక్కని ‘సొరంగ మార్గం’ చుట్టూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. నర్సంపేట డివిజన్ లోని ఖానాపూర్ మండలం అశోక్‌నగర్ లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న శివాలయాన్ని అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా కూల్చివేయడం వెనుక కేవలం భవన నిర్మాణం మాత్రమే ఉందా లేక కాకతీయ చక్రవర్తులు దాచిన అపార ఖనిజ సంపదను కాజేసే భారీ కుట్ర దాగి ఉందా అన్న అనుమానాలు ఇప్పుడు తీవ్రమవుతున్నాయి. అశోక్‌నగర్ ఘటనను లోతుగా పరిశీలిస్తే చారిత్రక సంపదను కొల్లగొట్టేందుకు జరిగిన ఒక పక్కా క్రైమ్ ఆపరేషన్ అనే కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. చరిత్రకారులు, పురావస్తు నిపుణుల విశ్లేషణ ప్రకారం ఖిలా వరంగల్ కోట నుంచి రామప్ప గుడి వరకు అత్యవసర రవాణా కోసం భూగర్భ సొరంగ మార్గం ఉండగా ఈ రహస్య మార్గానికి గుర్తులుగా కాకతీయులు ఒక గొలుసుకట్టు పద్ధతిలో శివాలయాలను నిర్మించారు. ఖిలా వరంగల్ నుంచి మొదలై ఎలుకుర్తి, మల్లంపల్లి ( దుగ్గొండి), మొగిలిచర్ల, జాకారం కోటగుళ్ళు, శనిగరం, గణపురం మీదుగా రామప్ప వరకు ఈ నెట్వర్క్ విస్తరించగా పాకాల, కటాక్షపురం చెరువుల నిర్మాణ సమయంలో తూర్పున కొత్తగూడ మండలంలోని గుండం శివాలయాన్ని, పడమరన అశోక్‌నగర్ శివాలయాన్ని మార్కర్లలా నిర్మించారు. ఈ ఆలయాల పునాదుల్లో లేదా గర్భాలయం కింద అపారమైన ఖనిజ సంపదను నిక్షిప్తం చేసినట్లు బలీయమైన నమ్మకం ఉండటమే ఇప్పుడు ఈ దాడులకు ప్రధాన కారణమవుతోంది.


రహస్య మార్గాలు – గొలుసుకట్టు నిర్మాణాలు..!
కాకతీయుల కాలంలో రక్షణ వ్యూహాలు అత్యంత పటిష్టంగా ఉండేవి. శత్రువుల కళ్లుగప్పి కోట నుంచి క్షేమంగా బయటపడటానికి ఖిలా వరంగల్ నుంచి రామప్ప వరకు భూగర్భ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఈ మార్గంలో ఎక్కడా దిశ తప్పకుండా ఉండేందుకు వీలుగా ప్రతి కీలక మలుపు వద్ద శివాలయాలను నిర్మించడం వారి ప్రత్యేకత. అశోక్‌నగర్‌లోని శివాలయం కూడా అందులో భాగమేనని, ఈ ఆలయాల కింద రహస్య గదులు లేదా ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని కేటుగాళ్లు భావిస్తున్నారు. గతంలో కటాక్షపురం, గణపురం కోటగుళ్లలోనూ శివలింగాలను పెకలించి ధ్వంసం చేసిన తీరుకూ అశోక్‌నగర్ ఘటనకూ దగ్గరి పోలికలు ఉండటం గమనార్హం. పాఠశాల నిర్మాణ సాకుతో ఆలయాన్ని తొలగించడం ఆపై పునాదుల తవ్వకం పేరుతో రహస్యంగా నిధుల కోసం అన్వేషించి లభించిన ఖనిజ సంపదను ఇతర ప్రాంతాలకు తరలించడం అనే మూడు అంచెల వ్యూహం ఇందులో ఉన్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. ఆలయం కూల్చిన తర్వాత అక్కడ అనుమానాస్పద రీతిలో తవ్వకాలు జరిగాయని గ్రామస్తులు, అప్పటి పాలకవర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. చారిత్రక ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత ఉన్న వారే గుప్తనిధుల కోసం ఆలయాలను ధ్వంసం చేస్తున్నారా అన్న కోణంలో విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయ సెగ – పురావస్తు శాఖ నిర్లక్ష్యం
కాకతీయుల కాలం నాటి రహస్య మార్గాలు, అందులోని సంపదను కాపాడటంలో పురావస్తు శాఖ విఫలమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే కొందరు అనుమానితులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయం ఉన్న స్థలంలోనే పాఠశాల నిర్మాణం చేపట్టడం వెనుక ఉద్దేశ్యపూర్వకమైన ‘కవర్-అప్’ ఉందా అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ సాగుతుండగా కాకతీయుల వారసత్వ కట్టడాల చుట్టూ అల్లుకున్న ఈ గుప్తనిధుల దందా వెనుక అసలు సూత్రధారులు ఎవరు అన్నది ఇప్పుడు వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతంలో తవ్వకాలు జరపడానికి అనుమతులు ఎవరు ఇచ్చారు? అర్ధరాత్రి వేళ గుడిని కూల్చాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక విచారణ జరిపించకపోతే కాకతీయుల నాటి మరిన్ని చారిత్రక కట్టడాలు నిధుల వేటగాళ్ల కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. గ్రామస్తుల ఆగ్రహం, రాజకీయ నేతల పరస్పర ఆరోపణల మధ్య అశోక్‌నగర్ ఘటన వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది.
అప్పుడు గుప్త నిధుల వేటగాళ్లు… ఇప్పుడు కాంట్రాక్టర్లు..?
అభివృద్ధి పనుల పేరుతో పురాతన కట్టడాల తవ్వకాలపై అనుమానాలు పెరుగుతున్నాయి. రాజకీయ అండతోనే అక్రమాలు జరుగుతున్నాయని డివిజన్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఒకప్పుడు గుప్త నిధుల వేట కోసం రాత్రివేళల్లో గ్రామాల పరిసర ప్రాంతాలు, పురాతన దేవాలయాలు, చారిత్రక కట్టడాల వద్ద రహస్యంగా తవ్వకాలు జరిపే వేటగాళ్లు కనిపించేవారు. కానీ ఇప్పుడు అదే తవ్వకాల సంస్కృతి అభివృద్ధి పనులు అనే పేరుతో కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, రోడ్లు, భవన నిర్మాణాలు, ఇతర ప్రభుత్వ పనుల పేరుతో పురాతన కట్టడాల చుట్టుపక్కల భారీ యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్న ఘటనలు ప్రజల్లో అనుమానాలకు తావిస్తున్నాయి. ఇటీవల నర్సంపేట డివిజన్లో చోటుచేసుకున్న సంఘటనలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఆలయాలు, పురావస్తు ఆనవాళ్లు ఉన్న ప్రాంతాల్లో ముందస్తు పరిశీలన లేకుండానే పనులు చేపట్టడం, భారీగా లోతైన గుంతలు తవ్వడం, స్థానికుల అభ్యంతరాలను పట్టించుకోకపోవడం వంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో గుప్తనిధుల కోసం రహస్యంగా తవ్వేవారు. ఇప్పుడు కాంట్రాక్టర్ల ముసుగులో అదే పని జరుగుతోందా అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ వ్యవహారాలు కొనసాగుతున్నాయన్న ప్రచారం కూడా డివిజన్లో జోరుగా సాగుతోంది. పురాతన దేవాలయాలు, కాకతీయుల కాలం నాటి కట్టడాలు ధ్వంసమవుతున్నాయన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. అభివృద్ధి పేరుతో చరిత్రను చెరిపేస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. పురావస్తు శాఖ అనుమతులు తీసుకున్నారా లేదా చారిత్రక నిర్మాణాల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, పురాతన కట్టడాల వద్ద జరుగుతున్న తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపించాలని, వాస్తవాలను వెలుగులోకి తేవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

