వీఓఏల సమ్మె సైరన్.. ఎస్సైకి నోటీసు
సమస్యల పరిష్కారానికి డెడ్‌లైన్
18 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు
కాకతీయ, ఏన్కూరు : తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఐకేపీ వీఓఏలు పోరాట బాట పట్టారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మంగళవారం ఏన్కూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సై నారబోయిన సంధ్యకు సమ్మె నోటీసుతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామీణ పేదల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తమను ప్రభుత్వం విస్మరిస్తోందని, తక్కువ వేతనాలతో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని ఈ సందర్భంగా వీఓఏ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వీఓఏల ప్రధాన డిమాండ్లలో నెలకు ₹20 వేల కనీస వేతనం అందించడం, ప్రత్యేక హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయడం వంటివి ప్రధానంగా ఉన్నాయి. 58 ఏళ్ల వరకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న టీఏ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా విధి నిర్వహణలో ఉన్నప్పటికీ, ప్రభుత్వం తమ సంక్షేమం గురించి కనీస చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని విమర్శించారు.
ఉద్యమ కార్యాచరణ ప్రకటన
ప్రభుత్వం మే 18, 2026 లోపు స్పష్టమైన హామీ ఇవ్వని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని నాయకులు హెచ్చరించారు. ఈ పోరాటంలో భాగంగా మే 13న రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఏపీఎం, జిల్లా పీడీలకు నోటీసులు అందజేశామని, మే 9న స్థానిక ఎమ్మెల్యేలను కలిసి తమ గోడును వివరించనున్నట్లు తెలిపారు. హక్కుల సాధన కోసం వీఓఏలందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

