ప్రియురాలు దూరం పెడుతోందని యువకుడి ఆత్మహత్యాయత్నం!
ఫ్లోర్ క్లీనర్ తాగుతూ సెల్ఫీ వీడియో రికార్డు
హన్మకొండ రాంనగర్లో కలకలం
కాకతీయ, హన్మకొండ : ప్రేమించిన అమ్మాయి దూరం పెడుతుందనే మనస్థాపంతో ఓ యువకుడు ఫ్లోర్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హన్మకొండ నగరంలో తీవ్ర కలకలం రేపింది. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్లో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంనగర్ ప్రాంతానికి చెందిన సల్మాన్ అనే యువకుడు ఒక అమ్మాయిని తీవ్రంగా ప్రేమించాడు. అయితే, గత కొంతకాలంగా ఆ అమ్మాయి అతడిని దూరం పెడుతూ వస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి, తీవ్ర మానసిక వేదనకు గురైన సల్మాన్ ఎలాగైనా ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్‌ను నోట్లో పోసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు, అందుకు గల కారణాలను వివరిస్తూ మొబైల్లో సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర అస్వస్థతకు గురైన సల్మాన్‌ను చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. యువకుడి సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి, అసలు ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

