ఏసీబీ వలలో పాలకుర్తి ఐరిగేషన్ డీఈ
రూ.50 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ శ్రీకాంత్
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బిల్లుల క్లియరెన్స్ కోసం డిమాండ్
హనుమకొండలోని నివాసంలో ఏసీబీ ఆకస్మిక దాడి
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లా పాలకుర్తిలో విధులు నిర్వహిస్తున్న సాగునీటి శాఖ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గంటి శ్రీకాంత్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ కాంట్రాక్టర్ నుండి రూ.50 వేల లంచం తీసుకుంటుండగా వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులు సోమవారం ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడు గతంలో నిర్మించిన 10 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన ఫైనల్ మెజర్మెంట్లు ఎం-బుక్స్‌లో నమోదు చేసి, బిల్లులు ప్రాసెస్ చేయడానికి డీఈ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ ఇళ్లకు సంబంధించిన ఫైనల్ బిల్లుల ప్రక్రియను సదరు అధికారి 2022 సెప్టెంబర్ నుండి పెండింగ్‌లో ఉంచినట్లు తెలిపారు. ఈ క్రమంలో హనుమకొండ భవానీనగర్‌లోని డీఈ నివాసంలో లంచం స్వీకరిస్తుండగా అధికారులు ఆకస్మిక దాడి చేసి రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందిత అధికారిని అరెస్ట్ చేసి వరంగల్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, భద్రతా కారణాల రీత్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు.

