రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో ఉండాలి
ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
స్టేషన్ ఘన్‌పూర్ ఏసీపీ భీమ్ శర్మ హెచ్చరికలు
రఘునాథపల్లి, లింగాల ఘన్‌పూర్ రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్
తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ ప్రక్రియ
కాకతీయ, రఘునాథపల్లి : ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే ఆసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఘన్‌పూర్ ఏసీపీ భీమ్ శర్మ హెచ్చరించారు. సోమవారం రఘునాథపల్లి సర్కిల్ కార్యాలయంలో రఘునాథపల్లి, లింగాల ఘన్‌పూర్ మండలాలకు చెందిన రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ భీమ్ శర్మ, రూరల్ సీఐ ఎడబెల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు చట్టాన్ని గౌరవిస్తూ, సమాజంలో మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. పాత నేరాలను విడనాడి, కుటుంబ సభ్యులతో కలిసి సక్రమమైన ఉపాధి మార్గాలను ఎంచుకోవాలన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అనంతరం రఘునాథపల్లి, లింగాల ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లను తహసీల్దార్ రాకేష్ రెడ్డి సమక్షంలో సత్ప్రవర్తన నిమిత్తం బైండోవర్ చేశారు. గ్రామాలు, పట్టణాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు నరేష్ యాదవ్, శ్రవణ్ కుమార్ గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

