ఘనంగా టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సం
కాకతీయ, తొర్రూరు : తొర్రూరు మండలం దంతాలపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు తాలూరి రవీందర్ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన అధ్యక్షతన ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాలూరి రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం ప్రారంభించిన నూతన వైద్య విధానంలో అనేక లోపాలు ఉన్నాయని విమర్శించారు. హెల్త్ కార్డు ఎంపిక విషయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఆప్షన్ ఇవ్వాలని, ఏయే ఆసుపత్రులు ఈ పథక పరిధిలోకి వస్తాయో ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడం సరైన విధానం కాదన్నారు.
ఈహెచ్ఎస్ విధానంలో లోపాలు సవరించాలి
కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా ఈహెచ్ఎస్ రికవరీ ఉండాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి 1.5 శాతం రికవరీ చేస్తున్న ప్రభుత్వం అదే మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యం అందించడంలో జాప్యం చేసే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి లోపాలులేని, అందరికీ ఆమోదయోగ్యమైన ఈహెచ్ఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీపీటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి చింతల సురేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ సీనియర్ కార్యకర్తలు డి. నగేష్, ఉమేష్, వెంకన్న, రామ్మూర్తి, ఎమ్మార్సీ సిబ్బంది ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

