జిల్లాలో 36 కొత్త పాఠశాలల ప్రారంభం
రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్పీడీ ఆమోదం..
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి వెల్లడి
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో చిన్నారుల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 విద్యాసంవత్సరం నుంచి జిల్లాలో కొత్తగా 36 పూర్వ ప్రాథమిక బడులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్పీడీ ఆమోదంతో ఈ బడులకు మంజూరు లభించినట్లు ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఇప్పటికే కొనసాగుతున్న 11 పూర్వ ప్రాథమిక బడులకు అదనంగా ఈ కొత్త బడులు ప్రారంభం కానుండటంతో గ్రామీణ ప్రాంత చిన్నారులకు విద్య మరింత చేరువ కానుందన్నారు. మండలాల వారీగా విద్యార్థుల సంఖ్య, స్థానిక అవసరాలు, అందుబాటు పరిస్థితులను పరిశీలించి బడుల మంజూరు చేపట్టినట్లు పేర్కొన్నారు.
చిన్నారుల్లో అభ్యాస సామర్థ్యాలు పెరుగుతాయి
విద్యాశాఖ మార్గదర్శకాల మేరకు చిన్నారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పూర్వ ప్రాథమిక బడుల ఏర్పాటు జరుగుతోందని సిద్ధార్థ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభ విద్యకు ప్రాధాన్యం పెంచేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల సహకారంతో చర్యలు కొనసాగుతున్నాయన్నారు. పూర్వ ప్రాథమిక విద్య ద్వారా చిన్నారుల్లో అభ్యాస సామర్థ్యాలు, భాషా నైపుణ్యాలు, సామాజిక అవగాహన పెంపొందుతాయని అభిప్రాయపడ్డారు. కొత్త బడుల ప్రారంభంతో జిల్లాలో విద్యా వాతావరణం మరింత బలోపేతం కానుందని పేర్కొన్నారు. ప్రారంభ దశ నుంచే పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, కొత్త పూర్వ ప్రాథమిక బడుల ద్వారా గ్రామీణ ప్రాంత చిన్నారులకు మెరుగైన విద్యా అవకాశాలు కలుగుతాయని తెలిపారు.

