నాడు ప్రారంభించారు.. నేడు వదిలిపెట్టారు
ఆరోగ్య ఉప కేంద్రానికి నిధులు వచ్చేనా
సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి కానీ భవన నిర్మాణం
ఎప్పుడు ఏ బిల్డింగ్‌లో ఉంటుందో తెలియక రోగుల సతమతం
సొంత జీతాల్లో నుంచే ఆరోగ్య ఉపకేంద్రానికి రెంట్లు కట్టిన వైద్యులు
పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులపై గ్రామస్తుల ఆగ్రహం
కాకతీయ, ఆత్మకూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనా కార్యక్రమాల్లో అన్ని శాఖల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్య సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని గ్రామ ప్రజలు బహిరంగంగా చర్చిస్తున్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రానికి నిత్యం గర్భిణీలు, వృద్ధులు, బాలింతలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే, ఈ కేంద్రం ఎప్పుడు ఎక్కడ కిరాయి ఇంట్లో మారుతుందో తెలియక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణాన్ని పూర్తి చేయడంలో ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జీతాల్లో నుంచే కిరాయిలు
ఆరోగ్య ఉపకేంద్రానికి సరైన ప్రభుత్వ బిల్డింగ్ లేకపోవడంతో తరచూ ఇళ్లను మార్చాల్సి వస్తోందని, గతంలో దీని రెంట్‌ను సిబ్బంది తమకు వచ్చే జీతాల్లో నుంచే కట్టేవాళ్లమని అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం రెంట్ లేకుండా తాత్కాలికంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాల క్రితం మండల కేంద్రంలోని పోచమ్మ సెంటర్ వద్ద నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భవన నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదని, ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామని స్థానిక సిబ్బంది పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ఈ భవనాన్ని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ప్రజలు మండిపడుతున్నారు.
నిధులు కేటాయించేనా
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ఆరోగ్య ఉపకేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించడంలో పూర్తిగా విఫలమైందని మండల కేంద్రంలో జోరుగా చర్చ జరుగుతోంది. గుత్తేదారునికి చేసిన పనుల తాలూకు బిల్లులు చెల్లించకపోవడంతోనే అతను పనులను మధ్యలోనే నిలిపివేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎప్పటికైనా ప్రజా ప్రభుత్వం స్పందించి ఆత్మకూరు మండల కేంద్రంలోని ఉపకేంద్రంపై ప్రత్యేక దృష్టి సారించి, బడ్జెట్ విడుదల చేసి పూర్తి స్థాయిలో భవనాన్ని నిర్మించాలని కోరుతున్నారు.
ఉత్సవాలకే పరిమితం
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఉత్సవాలకే పరిమితం అయిందని, ప్రజల కనీస సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైందని గ్రామస్తులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. గత 4 సంవత్సరాల నుండి ఆత్మకూరు మండల కేంద్రంలో ఆరోగ్య ఉపకేంద్రానికి సొంత భవనం లేక రోగులు నరకయాతన అనుభవిస్తున్నా.. జిల్లా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఈ సమస్య కనబడటం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి మధ్యలో ఆగిపోయిన భవన పనులను తక్షణమే ప్రారంభించాలని ఆత్మకూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

