రౌడీ షీటర్లపై కఠినంగా ఉండండి
బెల్ట్ షాపులపై ప్రత్యేక నిఘా ఉంచాలి
రోడ్లపై బర్త్‌డే వేడుకలు నిర్వహిస్తే కేసులు పెట్టండి
ద్విచక్ర వాహనాల చోరీలపై వెంటనే కేసులు నమోదు చేయాలి
అధికారులకు వరంగల్ సీపీ సన్ ప్రీత్‌సింగ్ ఆదేశాలు
నెలవారీ నేర సమీక్షా సమావేశంలో స్టేషన్ల వారీగా ఆరా
కాకతీయ, వరంగల్ బ్యూరో: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే రౌడీ షీటర్లపై కఠినంగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వరంగల్ లోని కిట్స్ కళాశాలలో నిర్వహించిన కమిషనరేట్ నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కమిషనరేట్‌కు చెందిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లపై నెలకు ఒకసారి తనిఖీ తప్పనిసరిగా చేయాలన్నారు. రౌడీ షీటర్లకు నిర్వహించే కౌన్సిలింగ్‌కు వంద శాతం హాజరు నిర్ధారించాలని, ప్రతి నెల స్టేషన్ అధికారులు వ్యక్తిగతంగా రౌడీ షీటర్ల ఇళ్లను సందర్శించి వారి పరిస్థితులను తెలుసుకోవాలని ఆదేశించారు. తనిఖీల సమయంలో అందుబాటులో లేని వారి కదలికలపై ప్రత్యేకంగా వివరాలు సేకరించాలన్నారు.

బెల్ట్ షాపులు, రోడ్లపై బర్త్‌డే వేడుకలపై కఠినంగా ఉండాలి
నేరాల నియంత్రణలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీపీ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాత్రి వేళల్లో బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేయించాలని, నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయడం లేదా బైండోవర్ చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి సమయంలో అధిక రద్దీ ఉండే ప్రాంతాల్లో ముమ్మర పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. ఇకపై రోడ్లపై జన్మదిన (బర్త్‌డే) వేడుకలు నిర్వహించి న్యూసెన్స్ చేసే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. చోరీలను అరికట్టేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇండ్లు, వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న వారి వివరాలు, హాస్టళ్ల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక పోలీసులు సేకరించాలన్నారు.
ద్విచక్ర వాహనాల చోరీలపై వెంటనే కేసులు
ప్రతి స్టేషన్ అధికారి ఉదయం 9 గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండాలని, నేరస్థుల అరెస్టులో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ద్విచక్ర వాహనాల చోరీలపై ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసులు నమోదు చేయాలని, పెట్రోలింగ్ వాహనాల పనితీరును క్షేత్రస్థాయిలో సమీక్షించాలని సూచించారు. మీ ఉద్యోగానికి మీరు న్యాయం చేస్తే ప్రజలకు న్యాయం చేసినట్టే అని సీపీ పేర్కొన్నారు. అనంతరం పెండింగ్ కేసులు, నేరస్థుల అరెస్టులు, దర్యాప్తు పురోగతి, నేర నియంత్రణ చర్యలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై అధికారులు చేపడుతున్న చర్యలను సీపీ సమీక్షించారు. ఈ సమావేశంలో డీసీపీలు అకింత్ కుమార్, దారా కవిత, రాజమహేంద్ర నాయక్, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్ రావు, బాలస్వామి, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

