పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు!
పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాల్సిన బాధ్యత కార్యకర్తలదే
బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి
మంత్రి సీతక్క పిలుపు
ఇంచర్లలో ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమావేశం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మండలంలోని ఇంచర్ల ఎంఆర్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పార్టీ కోసం నిజాయితీగా, క్రమశిక్షణతో కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన సమయంలో మంచి గుర్తింపు, గౌరవం తప్పక లభిస్తుందని స్పష్టం చేశారు. ప్రతి నాయకుడు తన పరిధిలో నిబద్ధతతో పనిచేస్తే పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
బూత్ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకం
ఎన్నికల సమయంలోనే కాకుండా పార్టీ నిర్మాణంలో కూడా బూత్ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బూత్ స్థాయిలో పార్టీని బలపరచడం ద్వారా మాత్రమే తిరుగులేని శక్తిగా ఎదగగలమని, అందుకు బూత్ ఏజెంట్లు ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను గ్రామాల్లోని ప్రతి ఇంటికీ చేరేలా చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపైనే ఉందని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడం ద్వారా పాలనపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని అన్నారు.
విభేదాలు పక్కనపెట్టి కలిసి నడవాలి
పార్టీ ఎదుగుదల కోసం పాత, కొత్త నాయకులు, కార్యకర్తలు తమ మధ్య ఏవైనా చిన్నచిన్న విభేదాలు ఉంటే వాటిని పక్కనపెట్టి ఒకే తాటిపై నడవాలని మంత్రి సూచించారు. అందరూ పూర్తి సమన్వయంతో పనిచేస్తే ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా మార్చగలమని ఆమె గట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ముఖ్య నాయకుల సమావేశంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగా కళ్యాణి సహా జిల్లా, మండల స్థాయి నాయకులు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

