మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
మహిళా భవనం, అంగన్వాడీ కేంద్రానికి శంకుస్థాపన
రూ.22 లక్షలతో దబ్బిర్ పేటలో అభివృద్ధి పనులకు శ్రీకారం
కాకతీయ,ఖానాపురం : ఖానాపురం మండలం దబ్బిర్ పేట గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా రూ.10 లక్షల వ్యయంతో మహిళా భవనం, రూ.12 లక్షల వ్యయంతో అంగన్వాడీ కేంద్రం నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ, మహిళల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. మహిళా సంఘాలకు అందిస్తున్న వడ్డీలేని రుణాలను సద్వినియోగం చేసుకుని, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే కుటుంబాలు మరియు గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

