రెడ్ క్రాస్ సేవా యజ్ఞానికి ఇనగాల చేయూత
ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.1,00,116లు విరాళం
గవర్నర్ శివప్రతాప్ శుక్లా సమక్షంలో ట్రస్టు చైర్మన్ వెంకట్రాంరెడ్డి అందజేత
రెడ్ క్రాస్ సేవా తత్పరత ఎంతో గొప్పది : ఇనుగాల వెంకట్రాంరెడ్డి
కాకతీయ, హన్మకొండ : సమాజ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మరోసారి నిరూపించారు. హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చేపట్టిన సేవా కార్యక్రమాలను, తలసేమియా బాధితుల పట్ల ఆ సంస్థ చూపుతున్న ఆప్యాయతను గుర్తించిన ఆయన, ఇనగాల ఛారిటబుల్ ట్రస్ట్ తరపున 1,00,116 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. హనుమకొండ పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రెడ్ క్రాస్ సొసైటీలోని బ్లడ్ బ్యాంక్, తలసేమియా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ బాధితులకు అందుతున్న వైద్య సేవలను, రక్త నిల్వల నిర్వహణను గవర్నర్ మరియు మంత్రి అభినందించారు. ఈ కీలక కార్యక్రమంలో ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పాల్గొని, గవర్నర్ మరియు మంత్రి సమక్షంలో విరాళం చెక్కును రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందించారు.
సేవాగుణానికి నిదర్శనం..
ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ, “నిరంతరం ప్రాణాపాయ స్థితిలో ఉండి, నిత్యం రక్తమార్పిడి అవసరమయ్యే తలసేమియా బాధితులపై రెడ్ క్రాస్ చూపుతున్న సేవా తత్పరత ఎంతో గొప్పది. రక్తదానం ప్రాణదానంతో సమానం. అటువంటి పవిత్రమైన సేవా యజ్ఞంలో భాగస్వాములు కావడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను” అని పేర్కొన్నారు. తన ట్రస్ట్ ద్వారా అందిస్తున్న ఈ చిన్నపాటి సాయం, బాధితుల ఆరోగ్య రక్షణకు, సంస్థ సేవలను మరింత విస్తృతం చేసేందుకు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా అధికార బాధ్యతలతో పాటు, సామాజిక బాధ్యతను కూడా నెరవేర్చడంలో ఇనగాల వెంకట్రామ్ రెడ్డి చూపుతున్న చొరవను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

